కేసీ కాలువలో ఈతకు వెళ్లి ఏడో తరగతి విద్యార్థి గల్లంతు

రిపోర్టర్: రాజేష్ స్థలం: కర్నూలు

కర్నూలు నగరంలోని కేసీ కాలువలో ఈతకు వెళ్లిన ఏడో తరగతి విద్యార్థి అభివర్ధన్ గల్లంతైనట్లు మూడో పట్టణ పోలీసులు తెలిపారు. లక్ష్మీదేవి, రత్నం దంపతుల పెద్ద కుమారుడైన పన్నెండు సంవత్సరాల అభివర్ధన్ తన స్నేహితులతో కలిసి వినాయక ఘాట్ వద్ద కాలువలోకి దిగాడు. కాలువలో గుర్రపు డెక్క ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కాల్వకు నీరు విడుదలైన రోజే విద్యార్థి గల్లంతు కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది.