అంగన్‌వాడీ కేంద్రంలో కాలం చెల్లిన మందుల గుట్టలు!
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
కలిగిరి మండలంలోని కృష్ణారెడ్డిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతల కోసం ప్రభుత్వం అందించిన మందుల గడువు రెండు నెలల క్రితమే ముగిసినా అధికారులు పట్టించుకోలేదు. కేంద్రంలో కాల పరిమితి ముగిసిన మందులు గుట్టలుగా పడి ఉండటం కలకలం రేపుతోంది. ఒకవేళ ఈ మందులు వాడితే చిన్నారులకు ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై ఐసీడీఎస్ సీడీపీవో పద్మజాకుమారి స్పందిస్తూ, పాత కిట్లను వాడొద్దని సూచించామని, ఆ కేంద్రంలో మందులు ఎందుకు ఉన్నాయో విచారణ చేస్తామని తెలిపారు.