కడెం : గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం
కడెం: గ్రామాల్లో రోజురోజుకూ అధ్వానంగా మారుతున్న పారిశుధ్య పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ కడెం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముందుగా మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి భూక్యా జాన్సన్ నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. రోడ్లు, వీధులు, కాలనీల్లో చెత్త పేరుకుపోవడం, మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడం, చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పారిశుధ్య సిబ్బంది కొరతతో ప్రజారోగ్యంపై ప్రభావం పడుతోందని, ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అనంతరం కడెం వరసంత అంగడిబజార్‌లో రైతులు, వ్యాపారులు, వినియోగదారులను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై అవగాహన కల్పిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతు తిరుపతి గౌడ్ యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జాన్సన్ నాయక్ దృష్టికి తీసుకువచ్చారు. యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని తెలిపారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు.
తదుపరి కడెం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన రోగులు, వారి కుటుంబ సభ్యులను కలిసి వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది, మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం, కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, రైతులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.