కడెం : యూరియా యాప్‌ ఇబ్బందులపై రైతు నిరసన

రిపోర్టర్: Radha. A స్థలం: కడెం

కడెం: యూరియా కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌తో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన రైతు ముంజ తిరుపతి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్‌ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్‌ను కలిసి వివరించారు.

ఈ సందర్భంగా తిరుపతి గౌడ్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశానంటూ తన చెప్పుతో తానే కొట్టుకుని నిరసన తెలిపారు.

రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందకపోవడం, యాప్‌ ద్వారా బుకింగ్‌లో ఎదురవుతున్న సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని వారు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే యూరియా సమస్యను పరిష్కరించి రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు.