'ఎక్స్ ఖాతా తొలగింపునకు ఏపీ పోలీసుల కుట్ర': ఎఫ్బీఐ పేరిట వచ్చిన ఈమెయిల్స్ బయటపెట్టిన వైఎస్సార్సీపీ

రిపోర్టర్: సునీల్ స్థలం: Amaravati

వైఎస్సార్సీపీ అధికారిక ఎక్స్ ఖాతాను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచిత్ర ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆ పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఎక్స్ సంస్థ నుంచి వైఎస్సార్సీపీకి వచ్చిన అధికారిక ఈమెయిల్స్ రసీదులను విడుదల చేస్తూ, అమెరికాకు చెందిన ఎఫ్బీఐ సంస్థ పేరిట ఏపీ పోలీసులు ఎక్స్ సంస్థకు ఫిర్యాదు చేశారని, గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం నుంచి ఈ దరఖాస్తు వెళ్లినట్లు ఆ ఈమెయిల్స్ స్పష్టం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ మండిపడింది. ఈ కుట్రపూరిత చర్యలపై జాతీయ మీడియా సంస్థలు, ఎఫ్బీఐ అధికారులను ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.