దసరా రద్దీ: ఏడు వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్న ఆర్టీసీ

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లో దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయని టీజీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ప్రత్యేక సర్వీసుల్లో ఛార్జీలను ఒకటిన్నర రెట్లు పెంచినట్లు వెల్లడించారు. సాధారణ బస్సుల్లో ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.