ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాల నమోదు: ఈనెల 16కు విచారణ వాయిదా

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మిపై సీబీఐ కోర్టు బుధవారం అధికారికంగా అభియోగాలను నమోదు చేసింది. నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా వ్యవహరించిన ఆమెపై ఐపీసీ మరియు అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపినట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పట్టాభిరామారావు స్పష్టం చేశారు. ఈ విచారణకు హాజరైన శ్రీలక్ష్మి తనపై మోపిన అభియోగాలను తీవ్రంగా తిరస్కరించి తాను నిర్దోషినని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నిలిచిపోయిన ఈ విచారణ ప్రక్రియ మళ్లీ ప్రారంభం కాగా, తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.