'నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించం': ఇల్లెందులో డయాగ్నొస్టిక్ సెంటర్ సీజ్

రిపోర్టర్: నరేష్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామదాస్, పిసిడిఎన్ఓ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్ ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డులు, అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించగా కొన్ని లోపాలు బయటపడ్డాయి. దీంతో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఒక డయాగ్నొస్టిక్ సెంటర్‌ను అధికారులు తక్షణమే సీజ్ చేశారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులు, కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.