ఫర్టిలైజర్ షాప్ తప్పిదం వల్ల 2 ఎకరాల పంట నష్టపోయామని రైతు నిరసన

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

తాము వరి పంటకు వేసేందుకు అడిగిన క్రిమి సంహారక మందు కాకుండా ఫర్టిలైజర్ దుకాణ యజమాని పత్తి పంటకు వేసే వేరే మందులు ఇవ్వడంతో తమ వరి పంట పూర్తిగా నాశనం అయిందని కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం రైతు, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ రెండు ఎకరాలలో వరి పంట సాగు చేస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో వరి పంటలో గడ్డి పెరగడంతో బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ ఫర్టిలైజర్ వద్ద వరి పంటలో పెరిగిన గడ్డి తొలగించే మందు ఇవ్వాలని అడగగా వారు పత్తి పంటకు వేసే మందు ఇచ్చినట్లు ఆరోపించారు. దీంతో తమకు తెలియక వరి పంటలో మందు చల్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో రెండు రోజుల్లో తాము సాగు చేస్తున్న వరి పంట మొత్తం చనిపోయిందని అన్నారు. ఈ విషయంపై సదరు ఫర్టిలైజర్ యజమానిని అడగగా తమకు ఎలాంటి సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. వ్యవసాయ అధికారులు స్పందించి తమ పంట నష్టానికి పరిహారం చెల్లించేలా చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.