మున్సిపల్ పీఠం కోసం హడావుడిగా పెళ్లిపీటలెక్కడంతో సాలూరులో రాజకీయ కలకలం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: సాలూరు
మున్సిపల్ ఛైర్పర్సన్ పదవిని దక్కించుకునేందుకు ఓ యువ నేత హడావుడిగా పెళ్లిపీటలెక్కడం ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన తెదేపా నేత, మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ మున్సిపల్ ఛైర్మన్ పదవిపై తీవ్ర ఆశలు పెట్టుకున్నారు. అయితే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సోమవారం వెలువడిన రిజర్వేషన్లలో అధ్యక్ష పీఠం బీసీ మహిళకు కేటాయించడంతో ఆయన ప్రణాళికలు తారుమారయ్యాయి. తనకు ఆ అవకాశం కోల్పోవడంతో, ఎలాగైనా మహిళల కోటాలో తన కుటుంబం నుంచే భార్యను బరిలో నిలపాలన్న సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.