గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి.. యాదాద్రి డీఎస్పీ వి. శ్రీనివాస్ నాయుడు
గణేష్ ఉత్సవాల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని యాదాద్రి డీఎస్పీ వి. శ్రీనివాస్ నాయుడు స్పష్టం చేశారు. ఉత్సవాలు భక్తి, సామరస్యంతో జరగాలే తప్ప ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం గుండాల రైతు వేదికలో గుండాల పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వి. సైదులు ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు.గణేష్ మండపాల ఏర్పాటులో నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రహదారులకు అడ్డంకులు కలిగించేలా మండపాలు ఏర్పాటు చేయరాదని, విద్యుత్ తీగలకు సమీపంలో లేదా ఆనుకునే విధంగా మండపాలు నిర్మించకూడదని స్పష్టం చేశారు. ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. గణేష్ ఉత్సవాల్లో డీజేల వినియోగానికి అనుమతి లేదని డీఎస్పీ తేల్చిచెప్పారు. లౌడ్‌స్పీకర్ల శబ్దం 70 డెసిబుల్స్‌కు మించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గణేష్ మండపాల నిర్వాహకులు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా పొందాలని, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేలా మట్టి గణేష్ విగ్రహాలను ప్రోత్సహించాలని కోరారు. ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం. శంకర్, తహసీల్దార్, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, శాంతి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు.