తిరుమలలో తీవ్ర నీటి కొరత: డ్యామ్లలో అడుగంటిన మట్టాలతో అధికారులు ఆందోళన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తిరుమల

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం తిరుమల పుణ్యక్షేత్రంపై తీవ్రంగా పడుతోందని టీటీడీ వాటర్వర్క్స్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. తగినంత వర్షపాతం లేకపోవడంతో కొండపై ఉన్న ప్రధాన జలాశయాలలో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. నిత్యం తరలివచ్చే వేలాది మంది భక్తులకు తాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. కొండపైనున్న కొన్ని జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోగా, ప్రస్తుత నిల్వలు కేవలం కొన్ని రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారులు వెల్లడించారు.