గొర్రె పిల్లను కాపాడబోయి లారీ ఢీకొని కాపరి నాగరాజు దుర్మరణం

రిపోర్టర్: రాజేష్ స్థలం: మక్తల్

నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచువార్ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఉట్కూరు మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి నాగరాజు (32), మందలోని గొర్రె పిల్లను లారీ కిందకు వెళ్లకుండా కాపాడబోయి లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్‌లో మక్తల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై మక్తల్ ఎస్సై రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.