'గిరిజన హక్కులను కాలరాస్తున్నారు': కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భూక్యా వీరభద్రం ఫైర్
రిపోర్టర్: సునీల్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని, కార్పొరేట్ శక్తులకు భూములు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతోందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో జరిగిన గిరిజన సంఘం మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల వాగ్దానాలను విస్మరించి గిరిజనులకు ద్రోహం చేసిందని, చేవెళ్ల డిక్లరేషన్ను అమలు చేయకుండా మోసగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 20న కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డులో జరగనున్న జిల్లా మహాసభలను గిరిజనులంతా ఐక్యంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.