మర్రిపాడులో వైసీపీ నామినేషన్ తిరస్కరణ

రిపోర్టర్: Darsigunta Naveen స్థలం: మర్రిపాడు

మర్రిపాడు మండలంలోని సింగనపల్లి వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి షేక్‌ ఖన్సా నామినేషన్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. శుక్రవారం నామినేషన్‌ పత్రాలను తెదేపా నాయకులు రిటర్నింగ్‌ అధికారి చేతిలో నుంచి తీసుకుని చించేశారని వైకాపా నాయకులు ఆరోపించారు. అనంతరం మరోసారి నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లగా, సమయం ముగిసిందంటూ తొలుత అనుమతించలేదని పేర్కొన్నారు.ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ ద్వారా వివరించినట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత రిటర్నింగ్‌ అధికారి బయటకు వచ్చి అభ్యర్థిని లోపలికి తీసుకెళ్లి నామినేషన్‌ స్వీకరించారని పేర్కొన్నాయి. అయితే శనివారం పరిశీలన సమయంలో అభ్యర్థి సంతకం లేదనే కారణంతో నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఆరోపించాయి. గతంలో చించివేసిన పత్రాల్లో సంతకం ఉందని వైకాపా నాయకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.