వంద శాతం ఉద్యోగ హామీ ఇచ్చి మోసం చేసిన ఎడ్యుఇక్స్ సంస్థ

రిపోర్టర్: అశోక్ స్థలం: పంజాబ్

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఎడ్యుఇక్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ సంస్థకు షాక్ ఇచ్చింది. వంద శాతం ఉద్యోగ హామీ ఇస్తామని చెప్పి కోర్సు పూర్తి చేసినా ఉద్యోగం కల్పించడంలో విఫలమైనందుకు ఎంబీఏ గ్రాడ్యుయేట్ హరీష్ మల్హోత్రాకు ఫీజు కింద చెల్లించిన 84,960 రూపాయలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అలాగే మానసిక వేదనకు పరిహారంగా పది వేల రూపాయలు, కోర్టు ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలను చెల్లించాలని గురుదాస్‌పూర్ కమిషన్ అధ్యక్షులు లలిత్ మోహన్ డోగ్రా నేతృత్వంలోని బెంచ్ తీర్పు వెలువరించింది.