మోత్కూర్ బస్టాండ్ ప్రాంతంలో వీధి కుక్కల తీవ్ర స్వైరవిహారం
మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ పరిసరాల్లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 వరకు కుక్కలు ఒకేచోట గుంపుగా తిరుగుతూ రాకపోకలు సాగించే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బస్టాండ్ల వద్ద నిత్యం ప్రయాణికులతో పాటు చిన్నారులు, వృద్ధులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనన్న భయం స్థానికుల్లో నెలకొంది. ముఖ్యంగా చిన్నారులపై దాడి జరిగే అవకాశం ఉందని, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కల బెడదపై పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి గుంపులుగా తిరుగుతున్న కుక్కలను అరికట్టి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.