బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రకు తీవ్ర తుఫాన్ ముప్పు

రిపోర్టర్: హరి స్థలం: శ్రీకాకుళం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖపట్నం - గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో శ్రీకాకుళం జిల్లాలో అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. ఎచ్చెర్ల, రణస్థలం, గార వంటి పదకొండు తీరప్రాంత మండలాల సమీపంలో ప్రత్యేక అధికారులను నియమించి, ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. తీరం వెంబడి గంటకు యాభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.