తిరుమల మాడ వీధుల్లో వైభవంగా జరిగిన పౌర్ణమి గరుడసేవ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తిరుమల
తిరుమల పుణ్యక్షేత్రంలో శనివారం రాత్రి పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గరుడసేవ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి ఏడు గంటల సమయానికి సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు విశేష దివ్యాభరణాల అలంకరణలో గరుడ వాహనంపై ఆసీనులై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్య మంగళ రూప దర్శనంతో ఆలయ ప్రాంగణమంతా శోభాయమానంగా మారి, భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగింది. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తులు గరుడసేవను తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అర్చకులు మరియు టీటీడీ అధికారులు విశేషంగా పాల్గొన్నారు.