గుర్గావ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా మహాపంచాయత్

రిపోర్టర్: సురేష్ స్థలం: గుర్గావ్

హర్యానాలోని గుర్గావ్‌లో సంచలనం సృష్టించిన గోల్ఫ్ కోర్స్ రోడ్ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు కల్యాణ్ సింగ్ బైన్స్లాకు మద్దతుగా కొద్దిరోజుల క్రితం మహాపంచాయత్ నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనపై బాధితురాలు శివాని చౌహాన్ అలియాస్ సియా తీవ్రంగా స్పందిస్తూ, నిందితుడిని వెనకేసుకొస్తూ కేసు దర్యాప్తును మరియు వాస్తవాలను తప్పుదారి పట్టించేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం, మతం రంగు పులిమి తప్పును కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయడం బాధాకరమని, రోడ్డుపై తనకు జరిగిన అన్యాయం ఎవరికైనా జరగవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు బైన్స్లా మరియు అతని సహచరుడు లవ్నీశ్ బాధితురాలి బైక్‌ను దాదాపు రెండు కిలోమీటర్లు వెంబడించి కావాలనే ఢీకొట్టినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ ఘటనపై కోర్టు నిందితులను పోలీసు కస్టడీకి తరలించగా, పోలీసులు సంఘటన స్థలంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు.