తిరుమలలో భారీ రద్దీ: ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. వరుస సెలవుల నేపథ్యంలో ఈ నెల 13న వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయాన్ని పూర్తిగా సామాన్య భక్తుల సర్వదర్శనానికే కేటాయించనున్నట్లు వెల్లడించింది. శనివారం ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.