విదేశాల్లో వైభవంగా బతుకమ్మ వేడుకలు: మలేషియాలో అంబరాన్నంటిన తెలుగు సంబరాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: మలేషియా

మలేషియాలోని కౌలాలంపూర్లో ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కమ్యూనిటీ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. బ్రిక్ఫీల్డ్స్ కందయ్య హాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రవాస తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాటాలతో సందడి చేశారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరై ప్రవాసుల ఐక్యతను అభినందించారు. ఉత్తమ బతుకమ్మలకు నిర్వాహకులు బంగారు, వెండి నాణేలను బహుమతులుగా అందజేశారు.