ట్రాన్స్ఫార్మర్పైకి ఎక్కి విద్యుదాఘాతంతో చిరుత మృతి
రిపోర్టర్: హరి
స్థలం: చంద్రపుర్
మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా చిమూరు తాలూకాలో కోతిని వేటాడుతున్న క్రమంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగిలి ఐదేళ్ల వయసున్న ఆడ చిరుత మృత్యువాత పడింది. శంకరాపూర్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. వానరాన్ని తరుముకుంటూ ట్రాన్స్ఫార్మర్ స్తంభంపైకి ఎక్కిన సమయంలో విద్యుదాఘాతానికి గురై చిరుత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని చిమూరు అటవీ క్షేత్రానికి తరలించి పశువైద్యుల చేత శవ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.