నిరుద్యోగుల ఉసురుతీస్తున్న ఏజెన్సీలు: ఉద్యోగాల పేరుతో భారీగా వసూళ్లు
రిపోర్టర్: రాజేష్
స్థలం: గద్వాల
గద్వాల జిల్లాలో నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు తీవ్ర శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు దండుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. అరకొర వేతనాలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ఈ ఏజెన్సీలపై ప్రభుత్వం వెంటనే స్పందించి విజిలెన్స్ విచారణ జరపాలని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.