అనంతగిరి ఘాట్ రోడ్డుపై విరిగిపడిన చెట్టు తొలగింపు

రిపోర్టర్: నరేష్ స్థలం: అనంతగిరి

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో తుపాను ప్రభావం కారణంగా గత కొన్ని గంటలుగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంతగిరి ఘాట్ రోడ్డుపై రోడ్డుకి అడ్డంగా ఒక భారీ చెట్టు కూలిపోయింది. చెట్టు పడిపోవడంతో రోడ్డుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనాలన్నీ రెండు వైపులా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అనంతగిరి ఎస్సై శంకర్రావు అప్రమత్తమయ్యారు. ఆయన తన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే జేసీబీ వాహనాన్ని రప్పించి, రోడ్డుకు అడ్డంగా పడిన భారీ చెట్టును పక్కకు తొలగించారు. ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు తీసుకుని రాకపోకలను పునరుద్ధరించడంతో ప్రయాణికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.