రాష్ట్రంలో గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి వేగం
రిపోర్టర్: గోపి
స్థలం: రంగారెడ్డి
తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సొంత భవనాలు లేని అయిదు వేల నూట పద్దెనిమిది గ్రామ పంచాయతీల కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఆమె వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన ప్రాంతీయ సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయాలు స్పష్టం చేశారు.