జల సంరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్న పెద్దమ్మకాడితండా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని పెద్దమ్మకాడితండా గ్రామస్తులు వర్షపు నీటి సంరక్షణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. వ్యవసాయ పనుల్లో తీరిక లేకున్నా ఉదయపు వేళల్లో శ్రమదానంతో ఊటకుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఇప్పటికే వ్యవసాయ కుంటలు, ఇంకుడు గుంతలతోపాటు పాఠశాల ప్రహరీ, పల్లె ప్రకృతి వనం వంటి మౌలిక వసతులను సమకూర్చుకున్నారు. ప్రజల చైతన్యం, పాలకుల సంకల్పం కలిస్తే మారుమూల గిరిజన పల్లెలు కూడా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తాయనడానికి ఈ తండా నిదర్శనంగా మారింది.