దారి లేని పల్లెలో డోలీ మోతలతో రోదిస్తున్న అడవితల్లి
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం దారకొండ పంచాయతీ గంగవరం వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాలకు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. గత తుపాను సమయంలో ధ్వంసమైన ఈ బ్రిడ్జిని అధికారులు ఇప్పటివరకు పునర్నిర్మించకపోవడంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా డోలీ మోతలే దిక్కవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు కలెక్టర్కు వినతులు సమర్పించినా స్పందన లేదని, ఇప్పటికైనా శాశ్వత ప్రాతిపదికన బ్రిడ్జిని మంజూరు చేయాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.