అర్నబ్ తుపాను బీభత్సం: విజయనగరంలో అతలాకుతలమైన జనజీవనం, నదుల ఉద్ధృతి
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయనగరం
అర్నబ్ తుపాను విజయనగరం జిల్లాను తీవ్రంగా అతలాకుతలం చేసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు ఏకమయ్యాయి. ప్రధాన పట్టణాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నడూ లేనివిధంగా కొన్ని మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కొత్తవలస మండలంలో ముప్పై సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో ఊళ్లన్నీ ముంపుబారిన పడ్డాయి. విజయనగరం, గరివిడి, చీపురుపల్లి, భోగాపురం, వేపాడ, ఎల్.కోట, ఎస్.కోట తదితర మండలాల్లో తీవ్ర ప్రభావం కనిపించింది. బొండపల్లి మండలం కొత్తపాలెంలో కన్నంనాయుడు చెరువుకు గండి పడగా, పలుచోట్ల అరటి, వరి పంటలు నీటమునిగాయి.