సత్యవేడులో అప్రకటిత విద్యుత్ కోతలను నివారించకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడతామని బుజ్జిరెడ్డి హెచ్చరిక
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సత్యవేడు
సత్యవేడు నియోజకవర్గంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుజ్జిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాగలాపురం, పిచ్చాటూరు మండలాల్లో రాత్రివేళల్లో కరెంట్ నిలిపివేస్తుండటంతో విద్యార్థులు, కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఈలకు ఫోన్లు చేసినా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. విద్యుత్ కోతలను, అదనపు ఛార్జీల బాదుడును వెంటనే ఆపకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.