నాగారం మండలంలో కారు అదుపుతప్పి టాటా సుమోను ఢీకొన్న వైనం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సూర్యాపేట

సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామ సమీపంలో సూర్యాపేట జనగాం ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం కారు అదుపుతప్పి టాటా సుమోను ఢీకొట్టింది. నాగారం నుండి తిరుమలగిరి వైపు వెళ్తున్న కారు వెనుక టైరు పగలడంతో ముందు వెళ్తున్న ఆటోను తప్పించబోయి ఎదురుగా వస్తున్న టాటా సుమోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు, సుమోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సుమో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని, సుమో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ మామిడి అజయ్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు.