అనాజిపురం దగ్గర లారీ డీసీఎం ఎదురెదురు ఢీ.. క్యాబిన్లలో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు.. ఒకరి పరిస్థితి విషమం.

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దత్తప్పగూడెం–అనాజిపురం గ్రామాల మధ్య గౌరెల్లి–కొత్తగూడెం ప్రధాన రహదారిపై లారీ, డీసీఎం వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు క్యాబిన్లలో చిక్కుకుపోవడంతో పరిస్థితి విషమంగా మారింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ, మరో టిప్పర్‌ లారీ సహాయంతో ఢీకొన్న రెండు వాహనాలను వేరు చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా దెబ్బతిన్న క్యాబిన్లలో చిక్కుకున్న డ్రైవర్లను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. జేసీబీ, టిప్పర్‌ సహాయంతో వాహనాలను వేరు చేసిన అనంతరం లారీ డ్రైవర్‌ను బయటకు తీసి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్‌ మాత్రం క్యాబిన్‌లో పూర్తిగా ఇరుక్కుపోయినట్లు స్థానికులు తెలిపారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. అతడిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ప్రమాదానికి గురైన TS 02 UA 7511 నంబర్‌ లారీ హైదరాబాద్‌ నుంచి మణుగూరు వైపు వెళ్తున్నట్లు సమాచారం. BR 11 GF 1381 నంబర్‌ గల డీసీఎం బీహార్‌కు చెందినదిగా స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.