ఖరీఫ్ 2026 ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు
ఖరీఫ్ 2026 సీజన్లో ధాన్యం కొనుగోళ్లను ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు మాట్లాడుతూ*... ధాన్యం రవాణా చేసే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ తప్పనిసరిగా ఉండాలని, ఓవర్‌లోడ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో హమాలీల సమస్య తలెత్తకుండా ముందస్తుగా హమాలీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో తూకం యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండేలా మెట్రాలజీ అధికారులు తనిఖీ చేయాలన్నారు.
ఈసారి కొనుగోలు ప్రక్రియలో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నందున, క్షేత్రస్థాయిలో తాజా ఫొటోలు, వివరాలను మాత్రమే నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఎంపిక చేసిన సన్న రకాల ధాన్యానికి నిబంధనల ప్రకారం బోనస్ అందేలా నాణ్యతను ఏఈఓలు, ఇన్చార్జిలు ధ్రువీకరించాలని తెలిపారు. జిల్లాలో ధాన్యం నిల్వకు గోదాము స్థలాన్ని ముందుగానే గుర్తించాలన్నారు.అక్టోబర్ 1, 2026న ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నందున, ఆ నాటికి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మిల్లుల మ్యాపింగ్, రవాణా, గోదాముల గుర్తింపు తదితర అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, రవాణా కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.