భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న వాగులు జలమయమైన పంట పొలాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: బలిజిపేట
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు పొంగిపొర్లడంతో రహదారులపైకి వరద నీరు చేరింది. వంతరాం, అంపావల్లి, పెదపెంకి గ్రామాల్లో వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొరగడాం, చిలకలపల్లి గ్రామాల్లో రెండు పూరిళ్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.