రాప్తాడు ఘటన: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని లోకేశ్ వెల్లడి
రిపోర్టర్: సతీష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్ లో ఇటీవల జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక ప్రస్తుతం స్పృహలోకి వచ్చిందని పేర్కొన్నారు. త్వరలోనే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారని వెల్లడించారు. ప్రాణాలకు తెగించి స్నేహితురాలిని కాపాడిన మరో విద్యార్థిని లక్ష్మి ధైర్యాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.