అధ్వానంగా మారిన దారి ఇబ్బందుల్లో కన్నెపల్లి రైతులు
కన్నేపల్లి మండలం, వీరాపూర్ గ్రామం నుంచి పంట పొలాలకు వెళ్లే రహదారి పూర్తిగా అధ్వానంగా మారడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి గుంతలమయంగా మారడంతో ప్రతిరోజూ వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంటలకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు తదితర వ్యవసాయ సామగ్రిని పొలాలకు తరలించేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు పేర్కొన్నారు. వర్షాలు కురిసిన సమయంలో రహదారిపై నీరు నిలిచిపోవడంతో ఎరువులు, ఇతర సామగ్రి తడిసి నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి ద్వారా సుమారు 200 ఎకరాల పంట పొలాలకు నిత్యం రైతుల రాకపోకలు కొనసాగుతున్నాయని తెలిపారు. వ్యవసాయ సీజన్లో రహదారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీరాపూర్ గ్రామం నుంచి పంట పొలాలకు వెళ్లే రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టి, రైతులకు రాకపోకల ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.