'పెళ్లి పనుల్లో విషాదం': ఆరంఘర్‌లో లారీ ఢీకొని తండ్రీకూతుళ్లు మృతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తా వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లు దుర్మరణం చెందారు. అత్తాపూర్‌కు చెందిన ఇస్మాయిల్ ఖాన్, ఆయన కుమార్తె బురుషాన్ బేగం బైక్‌పై వెళ్తుండగా, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. మరో వారం రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా, పెళ్లి పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.