'రైలు పైనుంచి రైలు ప్రయాణం': విజయవాడలో తుది దశకు ఆర్‌ఓఆర్‌ నిర్మాణం

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయవాడ

విజయవాడ రైల్వే డివిజన్‌లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు చేపట్టిన దేశంలోనే అరుదైన రైల్‌ ఓవర్‌ రైల్‌ (ఆర్‌ఓఆర్‌) నిర్మాణం తుది దశకు చేరుకుంది. విజయవాడలోకి ప్రవేశించకుండా ఖాజీపేట, సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే గూడ్స్‌ రైళ్లను మళ్లించేందుకు రాయనపాడు, ముస్తాబాద వద్ద రూ.500 కోట్లతో 22 కిలోమీటర్ల మేర ఈ బైపాస్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్న ఈ మార్గంతో రాయనపాడు, గుణదల స్టేషన్లు శాటిలైట్‌ స్టేషన్లుగా మారనున్నాయి.