తిరుమల గరుడసేవకు భారీ ఏర్పాట్లు: ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాల నిషేధం

రిపోర్టర్: సతీష్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం జరుగనున్న గరుడసేవకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో టీటీడీ, పోలీసు శాఖలు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని గురువారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించినట్లు ఆయన తెలిపారు. భక్తులు తిరుపతిలోని నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలలో వాహనాలు నిలిపి, ఆర్టీసీ బస్సుల్లో రావాలని జిల్లా ఎస్పీ సూచించారు.