'మహిళా సాధికారతకు ఏపీఎల్ వేదిక': కేశినేని శివనాథ్

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయవాడ

మహిళా క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 19 నుంచి 27 వరకు మహిళల ఏపీఎల్ (విమెన్ ఏపీఎల్‌) టోర్నమెంట్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలోని ఏసీఏ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగు జట్లు తలపడనున్న ఈ మెగా టోర్నీని ఫ్లడ్ లైట్ల వెలుతురులో డే అండ్ నైట్ విధానంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా నారా బ్రాహ్మణి హాజరుకానున్నారని వెల్లడించారు. ప్రేక్షకులకు స్టేడియంలోకి ఉచిత ప్రవేశం కల్పించడంతో పాటు విద్యార్థుల కోసం విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.