'తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది': మల్లారెడ్డి ఫ్లెక్సీల రగడపై బీఆర్ఎస్ శ్రేణుల హెచ్చరిక
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఐడిపిఎల్, సుచిత్ర ప్రాంతాలలో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఈ ఫ్లెక్సీలలో పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చిత్రాలను విస్మరించి కేవలం మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోటోలు మాత్రమే ముద్రించడాన్ని గులాబీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ అధిష్టానాన్ని, క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ స్వప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని మండిపడుతూ ఆగ్రహంతో ఆ ఫ్లెక్సీలను చించివేశారు. పార్టీ పెద్దలను, స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు గట్టిగా హెచ్చరించగా, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు నాయకులకు సంబంధం లేదని ప్రీతిరెడ్డి వర్గీయులు వాదిస్తున్నారు.