తిరుమల బ్రహ్మోత్సవాలలో సింగపూర్ కూచిపూడి కళాకారుల నాట్య నివేదన
రిపోర్టర్: వెంకట్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సింగపూర్‌కు చెందిన కూచిపూడి నృత్య కళాకారులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నాట్య నివేదన సమర్పించేందుకు తిరుమలకు బయలుదేరారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో, శ్రీ సాంస్కృతిక కళాసారథి–సింగపూర్ ఆధ్వర్యంలో అభినయ నాట్యాలయ మరియు మాతృశ్రీ సాయి అకాడమీకి చెందిన 22 మంది విద్యార్థులు, గురువులు, తల్లిదండ్రులతో కలిపి సుమారు 45 మంది ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవ సందర్భంగా తిరుమల మాడవీధుల్లో స్వామివారికి వీరు కూచిపూడి నృత్యం ద్వారా నాట్య సేవ చేయనున్నారు. విదేశాల్లో తెలుగు సంప్రదాయ కళలను అభ్యసిస్తున్న యువ కళాకారులు స్వయంగా తమ ఖర్చులతో భారత్‌కు వచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం విశేషం. కార్యక్రమం అనంతరం వీరికి వీఐపీ దర్శనం, లడ్డూ ప్రసాదాలు అందించనున్నారు.