కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎల్‌నినో పదేళ్లకు ఒకసారి వస్తే.. ఎల్ కాంగో మాత్రం రోజూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నదని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రైవేట్ ఆస్తులపై కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అద్దంకి దయాకర్ పోలీసుల పహారాలో దాడులకు వెళ్లడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రైవేట్ ఆస్తులపైకి వెళ్లే హక్కు చట్టంలో ఎక్కడుందని డీజీపీని నిలదీశారు. నాదర్‌గుల్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలను ప్రస్తావిస్తూ, దమ్ముంటే అక్కడికి వెళ్లాలని కాంగ్రెస్ ఎంపీలకు సవాల్ విసిరారు. సాక్షాత్తు పోక్సో కేసులో కేంద్ర మంత్రి కొడుకును సీఎం రేవంత్‌రెడ్డే కాపాడారని ఆరోపించారు.