ఘనంగా సామూహిక కుంకుమ పూజలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కస్పా ఆర్యవైశ్య సంఘ భవనంలో వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని ఘనంగా కుంకుమ పూజ నిర్వహించారు. సంఘ అధ్యక్షులు వెత్స శ్రీను ఆధ్వర్యంలో సుమారు వంద మంది మహిళలు ఈ పూజా కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి కుంకుమ అర్చన చేశారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వామి వారికి వంద రకాల పిండి వంటలతో ప్రత్యేక నైవేద్యం సమర్పించారు. పూజా కార్యక్రమం అనంతరం సుమారు మూడు వందల మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అక్షింతలు సతీష్, ముత్యాల శ్రీను, నాగేశ్వరావు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.