తరగతి గదిలో సహ విద్యార్థి దాడిలో పదో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కోల్కతా
కోల్కతాలోని ఓ ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పదిహేనేళ్ల విద్యార్థిపై తరగతి గదిలో తోటి విద్యార్థి పదునైన వస్తువుతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాధితుడి మెడకు, ఎడమ చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు వెల్లడించారు. నిందితుడైన విద్యార్థి ఆటిజంతో బాధపడుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. పాఠశాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అదనపు పోలీస్ కమిషనర్ కునాల్ అగర్వాల్ వెల్లడించారు.