22-ఏ భూములపై సమీక్ష వేగవంతం చేయాలి:డా.చినుకని శివ ప్రసాద్‌

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నాంపల్లి

హైదరాబాద్: తెలంగాణలో 22-ఏ జాబితాలో ఉన్న భూములపై ప్రభుత్వం చేపట్టిన సమీక్షను మరింత పారదర్శకంగా, రాష్ట్రవ్యాప్తంగా వేగవంతం చేయాలని సహస్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ డా. చినుకని శివ ప్రసాద్‌ కోరారు. రాష్ట్రంలో 1.02 కోట్ల ఎకరాలకు పైగా భూములు 22-ఏ పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ గణాంకాలు పేర్కొంటున్నాయని తెలిపారు. ఇప్పటికే సుమారు 47 వేల ఎకరాలను జాబితా నుంచి తొలగించిన నేపథ్యంలో మిగిలిన భూములపై ప్రతి సర్వే నంబర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. నిషేధానికి కారణం, భూమి కేటగిరీ, సంబంధిత ఉత్తర్వులు, యాజమాన్య స్థితి, పరిష్కార వివరాలను ఆన్‌లైన్‌లో స్పష్టంగా అందుబాటులో ఉంచాలని కోరారు. అర్హులైన ప్రైవేటు భూములను నిర్ణీత కాలపరిమితిలో 22-ఏ జాబితా నుంచి తొలగించి, ప్రభుత్వ, రక్షిత భూములను కట్టుదిట్టంగా పరిరక్షించాలని ఆయన పేర్కొన్నారు.